Monday 17 March 2014

లీడర్ -అనేవాడు ప్రత్యేకంగా పుట్టడు. ప్రత్యేకత నుంచి పుట్టుకొస్తాడు. (Leadership Qualities)

లీడర్ -అనేవాడు ప్రత్యేకంగా పుట్టడు. ప్రత్యేకత నుంచి పుట్టుకొస్తాడు. అందుకే ప్రతి ఒక్కరిలోనూ లీడర్ -అపరిచితుడిలా దాగివుంటాడు. అలాగని తన లక్ష్యసాధన కోసమే బయటపడే అపరిచితుడు లీడర్ కాలేడు. లీడర్ తన కోసం తానుగా జీవించడు. జన హృదయాల ఘోషను శాంతింపజేయడానికి పోరాడుతాడు.

ఇటీవలి కాలంలో ‘అవినీతి’పై పోరు అంబరాన్ని అంటింది. ‘అన్నాహజారే! జిందాబాద్!’ అంటూ యువ హృదయాలు ఎగిసిపడ్డాయి. స్వచ్ఛతతో మద్దతు పలికాయి. మరి ఆ లీడర్ యువకుడు కానే కాదు. అయినా దేశమంతా పోరాట స్ఫూర్తితో ఊగిపోయింది. మరీ ముఖ్యంగా యువతరంగం ఎగిసిపడింది. చివరకు ఉద్యమ ఉద్ధృతికి ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు. లీడర్ ఏ వయసు వాడైనా జన హృదయాన్ని గెలిచే సత్తా వుంటే -ఆ శక్తి లీడర్‌స్థాయిని అమాంతంగా పెంచేస్తుంది. మరి లీడరే యువకుడైతే?! ఉక్కు నరాలు.. ఇనుప కండరాలతో ప్రపంచ పునాదులే కదిలిపోతాయ్.
లీడర్ కావాలంటే మొదట కావాల్సింది ‘అంకితభావన’.. సమాజానికి తనను తాను సమర్పించుకోవాలి. సమస్యల పోరాటంలో మొదట తానొక్కడే! అతను ఎంచుకున్న మార్గలు, నడత, పనితీరు మొదలైన ఎన్నో నాయకత్వ లక్షణాలు అతనికో ‘దండు’ని ఏర్పరుస్తుంది. ఆ దండు అతనికి మరింత మనోబలాన్నిస్తుంది. అదే అతడి రక్షణ. ఆయుధం. ప్రతి విషయంలో మంచి చెడు వున్నట్లే లీడర్‌షిప్‌లో కూడా మంచి చెడు వుంటుంది. మంచి లీడర్‌షిప్ నిస్వార్థంతో కలకాలం నిలిచిపోతుంది. లీడర్‌షిప్‌లో చెడు దాగివుంటే అది బయటపడేలోపు జరగాల్సినంత నష్టం జరిగిపోతుంది.
ప్రతిరంగంలో లీడర్స్ ఉద్భవిస్తూనే వుంటారు. కాని స్వచ్ఛత కలిగిన లీడర్‌షిప్పే ఎక్కువ కాలం ప్రభావితం చేస్తుంది. ఓ గాంధీ.. నెల్సన్ మండేలా.. మదర్ థెరిసా.. సద్దాం హుస్సేన్.. గఢాఫీ యిలా ఎందరో లీడర్స్. వీరిలో స్వచ్ఛమైన నాయకత్వం వున్న లీడర్స్ వున్నట్లే స్వార్థపూరిత నాయకత్వం గల లీడర్స్ కూడా వున్నారు. కాని చరిత్రలో వారి స్థానాలేమిటో మనకు తెలియంది కాదు.
లీడర్‌కి ‘్ఛరిష్మా’ కావాలంటారు. నిజమే! లీడర్‌లో వున్న అన్ని క్వాలిటీస్‌తోపాటు ఆకర్షించే శక్తి (్ఛరిష్మా) వుంటే ఆ నాయకత్వ పటిమ మరింతగా దూసుకుపోతుంది. ఛరిష్మా వుండి మిగతా క్వాలిటీస్ లేకపోయినా నాయకత్వం నడుస్తుందంటే అది పునాది లేని బిల్డింగే అవుతుంది. అలాటి నాయకునికి ‘్ఫలోయర్స్’ వుంటారేగాని సమర్థవంతమైన ‘సపోర్టర్స్’ వుండరు.
లీడర్ అనే పదానికి సరైన పవర్‌ని అందించే రంగం ‘రాజకీయం’. పరిపాలనను చేజిక్కించుకోవడానికే లీడర్స్ అవతరిస్తూ వుంటారు. ప్రజానీకానికి లీడర్ ఎక్కువగా ఈ రంగం ద్వారానే పరిచయవౌతాడు. మన దేశంలో పరిపాలన మొదలైన నాటినుండి నేటి వరకు ఉద్భవించిన లీడర్స్‌యొక్క నాయకత్వాన్ని మనం చూసాం, చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని ప్రక్కనపెట్టి ఫాలోయర్స్ అధికంగా గల వాడే లీడర్ అనే స్థాయిలో మైండ్‌ని ఫిక్స్ చేసేసుకున్నాం.
నాయకత్వ లక్షణాలు అన్నింటిని ప్రక్కన పెట్టి నలగని దుస్తులు.. చెదరని మేకప్‌లతోపాటు నిత్యం అనుచరగణంతో సంచరించేవాడే నిజమైన లీడర్ అనుకునే భ్రమలోకి జారుకున్నాం. లీడరంటే ఇలాగే వుండాలి, ఇలాగే ప్రవర్తించాలని భావిస్తున్నాం. ఈ ముసుగులో లోఫర్ కూడా లీడరై కనిపిస్తున్నాడు. నిజమైన లీడర్స్ కనుమరుగైపోతున్నారు అనుకునే తరుణంలో అన్నాహజారే వంటి వ్యక్తులు నిజమైన లీడర్స్‌గా కనిపించడం యువతకు స్ఫూర్తిని కలగజేస్తుంది.
ఎలాగైనా సాధించాలి అనుకోవడం లీడర్‌షిప్ క్వాలిటీ కాదు. సైద్ధాంతిక ప్రకారం సాధించాలని చెప్పడం కరక్టే అయినా సమస్యకు అది సరిపోవాలి. అతివాదులు.. విప్లవకారులు సైతం మన దేశస్వాతంత్య్ర సమరంలో లీడర్స్‌గా తమ సత్తాను చాటారు. కాని గాంధీజీ అహింస.. సత్యాగ్రహ సిద్ధాంతమే సమస్యకు సరిపోయింది. ఇప్పటికీ అనేక సమస్యల సాధనకై ఎందరో లీడర్స్ తమ స్టయిల్స్‌లో పోరాటం చేస్తూనే వుంటారు. కాని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలిగే శక్తి కొందరి లీడర్స్‌లోనే వుంటుంది. అలాంటి లీడర్స్ అవతరించే వరకు సమస్యకు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే లభిస్తాయి.
యువతలో లీడర్‌షిప్ క్వాలిటీస్ విద్యార్థి జీవితంలోనే మొదలవుతాయి. అయినా కొంతమంది మాత్రమే లీడర్స్‌గా అవతరించగలుగుతారు. మిగతావారంతా భావాలను వ్యక్తీకరించే, సమర్థించే దండుగా మిగిలిపోతారు. మంచి ఆరేటర్ (వక్త) మంచి లీడర్ కాగలడు. తన ప్రసంగాలతో ఎందరినైనా ఆకర్షించి పోరాట స్ఫూర్తిని కలిగించగలడు. మాటను మించిన ఆయుధం మరొకటి లేదు. అందుకే ‘లీడర్’ పిలుపు కోసం ఎదురుచూస్తారు. ఇలాంటి పిలుపులో బలంవుండాలంటే స్థిరమైన నిర్ణయాలు తీసుకునే శక్తి లీడర్‌లో వుండాలి.
యువతలో నిద్రాణమైన ఉడుకునెత్తురు వుంటుంది. దానిని రగిలిస్తే ప్రళయం తప్పదు. అందుకే లీడర్ యువతకు స్ఫూర్తినిచ్చే తత్వం కలిగి వుండాలి. తన స్వార్థ ప్రయోజనాల కోసం యువతను తప్పుదోవ పట్టించే లీడర్ దండుని కోల్పోక తప్పదు. భారతదేశంలో యువ జనాభా ఎక్కువ. అలాంటప్పుడు ఎంతమంది లీడర్స్ ఉద్భవించాలి? కానీ ఆ పరిస్థితి కనిపించడంలేదు. ఏ రంగంలోనైనా మధ్యవయసు దాటి చరమాంకంలో పడ్డవారే లీడర్స్‌గా కనిపిస్తారు. ఎందుకిలా? లీడర్‌షిప్‌ని స్వీకరించాలంటే నిశ్చలతత్వం.. అంకితభావం కావాలి.
‘ఎవరో ఒకరు ఎపుడోకపుడు పోరాడుతారులే!’ అన్నభావన నానాటికీ పెరిగిపోతుంది. లీడర్ కావాలంటే స్వార్థరహిత జీవనం అలవాటు చేసుకోవాలి. నేడు సమస్యపై స్పందించేకంటే సర్దుబాటు చేసుకోవడానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాం. అలాంటప్పుడు లీడర్ ఎలా అవతరిస్తాడు? నేడు సమాజంలో ఎన్నో రుగ్మతలు. వాటన్నింటిపట్ల ముందు స్పందించే గుణాన్ని యువత అలవాటు చేసుకోవాలి. అదే మీలో దాగున్న లీడర్‌ని మేల్కొలుపుతుంది. ఒక్కసారి మీలో లీడర్ మేల్కొన్నాక మీ లైఫ్‌స్టైలే మారిపోతుంది! ఎంత దూర ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. మీలోని లీడర్‌షిప్ క్వాలిటీస్ మిమ్మల్ని పదిమందిలో ఒక్కరిగా కాకుండా పదిమందికీ ఒక్కరిగా నిలబెడుతుంది. అప్పుడు మీరే లీడర్.. మీలోని అంకితభావం.. నిస్వార్థం.. నిర్మలత్వం వంటివి మీలోని లీడర్‌కి గీటురాళ్ళుగా నిలుస్తాయ.

No comments:

Post a Comment