Sunday 9 March 2014

నూతన నాయకత్వానికి కావలసిన నవ మార్గ దర్శకాలు !

మన రాష్ట్రములోను, కేంద్రంలోను ఇది ఎన్నికల సమయం ! 

వివిధ రాజకీయ పార్టీలలో,స్వచ్చంద సంఘాలలో వారి వారి నాయకత్వ లక్షణాలను ,అదృష్టాన్ని పరీక్షించు కొనేందుకు సన్నద్దమవుతున్న చాల మంది యువకులకు(ఏ రంగములోని వారికైనా అందరికి ) ఉపయోగ పడే విధముగా స్వామి వివేకానందుల వారు వివధ సందర్బాలలో నాయకత్వం గురించి చెప్పిన మాటలుతీసి తొమ్మిది సూత్రాలుగా మార్చాను (నా కొద్ది వ్యాఖ్యనముతో) .
వీటిలో ఏ కొన్ని పాటించినా ఖచ్చితముగా మనం మంచి నాయకులం అవుతాము.



ఓటు వేసే మిత్రులు వీటిలో కనీసం 3 సూత్రాలు పాటించ గలిగే నాయకుడిని మీ ప్రాంతంలో గాని మీ నియోజక వర్గంలో గాని మీ వూరిలో గాని చూస్తే ఆ వ్యక్తీకి పార్టీలకు అతీతంగా ఓటు వేయండి కొంచెం మనశ్శాంతి కలుగుతుంది
యువ నాయకత్వానికి కావలసిన నవ మార్గ దర్శకాలు (సూత్రాలు)

1)సేవకుడే నాయకుడు (నాయకుడైన వాడు మొదట సేవకుడు గా వుండడం తెలుసుకోవాలి )

2)నాయకత్వం వహించే వాడు అపరిమిత ధైర్యము, అనంత విశ్వాసము, అఖండ సహనము కలిగి నిస్వార్ధముగా ఉండాలి.

3)విశ్వాసము ,సౌశీల్యం కలిగిన కొద్దిమంది వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర..!
మనకు కావలసినవి మూడు
1) ప్రేమించే మరియు స్పందించే హృదయం
2)భావించే (ఆలోచించే) మనస్సు
3)పని చేసే చెయ్యి

4)మీరందరూ వర్గ కీచులాటలను,అసూయను విడిచి పెట్టండి. భూమాతవలె ఓరిమి కలిగి వుండండి.దీనిని మీరు సాధించగలిగితే లోకమే మీకు పాదక్రాంతము అవుతుంది.

5)మిమ్మల్ని ఒక శక్తిజనకమైన యంత్రముగా తయారుచేసుకోండి..! ప్రజలు మనల్ని మంచి వారు అని, చెడ్డ వారు అని అంటారు. కాని నాయకుడు ఆదర్శాన్ని ముందుంచు కొని సింహాల్లాగా మనం పనిచేయాలి.
"ఏమన్నా కానిమ్ము..ఎవరినన్నా రానిమ్ము.. జగత్తంతా ఎదురు తిరిగినగాని.. ఒక్క అడుగైన వెనుక వేయకు".

6)ప్రతిఘటన, వ్యతిరేకత ఎంత ఎక్కువ వుంటే అంత మంచిది, ప్రతిఘటన లేనిదే నదికి వేగము రాదు.
ఒక విషయం ఎంత కొత్తదైతే, ఎంత మంచిదైతే ప్రారంభ దశలో అంత వ్యతిరేకతను ఎదుర్కొనవలసి వస్తుంది.
7) 'లోకం తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోని నేను ధర్మ మార్గాన్ని అనుసరిస్తాను" అన్నదే ధీరుని విధానము .
దానినే కొంచెం గట్టిగా ఇలా కూడా అంటారు
" త్రుచ్చులు నీ గురించి ఏమైనుకొంటే నీకేమి, ఎన్ని వ్యర్ధ ప్రేలాపనలు చేసినా కాని వారి కేసి క్రీగంటనైన చూడకు,లెక్క చేయకు"

8)పరిస్థితులు నీకు ఎంత ప్రతికూలముగా వుంటే నీలో నీవు అంత అంతర్గత శక్తిని పెంచుకోగలవు .
" సంఘం ప్రతిఘటించే కొద్ది మన శక్తీ మరింతగా వెలువడుచున్నది ".

9)హృదయం లేని మేధావులను గాని, వారి పత్రికా వ్యాసాలను గాని, వార్త పత్రికల వంచనలను పట్టిచుకోవద్దు. "చదువులేని మూర్ఖుని కంటే చదువున్న మూర్కుడు మరింత చక్కగా తన మాటలతో జనులను మరింత మోసము చేయును" (మన దేశం లో ఇలాంటి వారు ఈ మధ్య ఎక్కువ మంది తయారయ్యారు )

ధన్యవాదములతో
మీ గోపి చిల్లకూరు
డల్లాస్ టెక్సాస్

No comments:

Post a Comment